ఐదేండ్లలో 20 వేల మెగావాట్ల గ్రీన్‌‌‌‌ పవర్‌‌‌‌

ఐదేండ్లలో 20 వేల మెగావాట్ల గ్రీన్‌‌‌‌ పవర్‌‌‌‌
  • రైతులకు సోలార్‌‌‌‌ పంప్‌‌‌‌సెట్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు 
  • డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క

అశ్వారావుపేట, వెలుగు : ఐదేండ్లలో తెలంగాణలో 20 వేల మెగావాట్ల గ్రీన్‌‌‌‌పవర్‌‌‌‌ ఉత్పత్తి చేసేలా కసరత్తు చేస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలోని పామాయిల్ ఫ్యాక్టరీలో నిర్మించిన 2.5 మెగావాట్ల పవర్‌‌‌‌ ప్లాంట్‌‌‌‌ను శనివారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం డిప్యూటీ సీఎం మాట్లాడుతూ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రూ. 2 లక్షల రుణమాఫీ పూర్తి చేసి చరిత్ర సృష్టించామన్నారు.

గత పాలకులు అరకొర రుణమాఫీ చేసి చేతులు దులుపుకొని, ఇప్పుడు దుష్ర్పచారం చేస్తున్నారని మండిపడ్డారు. రైతులకు పంట బీమా ప్రీమియం ప్రభుత్వం చెల్లిస్తుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిధులతో ఇండ్లపై కూడా సోలార్‌‌‌‌ ప్యానెళ్లు పెట్టుకునేలా ఆలోచన చేస్తున్నామన్నారు. సొలార్‌‌‌‌ పంప్‌‌‌‌సెట్లు ఇవ్వనున్నామన్నారు. 

దీని వల్ల రైతులు తమకు కావాల్సిన విద్యుత్‌‌‌‌ను వాడుకొని మిగిలిన దానిని గ్రిడ్స్‌‌‌‌కు అమ్ముకోవచ్చని చెప్పారు. అశ్వారావుపేట నియోజకవర్గంలో రెండు గ్రామాలను ఎంపిక చేసి పైలెట్‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌ ప్రారంభిస్తామని చెప్పారు. కార్యక్రమంలో అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, కలెక్టర్‌‌‌‌ జితేశ్‌‌‌‌ వి.పాటిల్‌‌‌‌, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేనని సాంబశివరావు, సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయి, వైరా ఎమ్మెల్యే రాందాస్‌‌‌‌ నాయక్‌‌‌‌, మహబూబాబాద్‌‌‌‌ ఎంపీ బలరాం నాయక్, అగ్రికల్చర్‌‌‌‌ ప్రిన్సిపల్‌‌‌‌ సెక్రటరీ రఘునందన్, ఆయిల్‌‌‌‌ ఫెడ్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ జంగా రాఘవరెడ్డి, రాయల నాగేశ్వరరావు పాల్గొన్నారు.

ప్రతి రైతు ఆయిల్‌‌‌‌ పామ్‌‌‌‌ సాగు చేయాలి

జిల్లాల్లో పామాయిల్‌‌‌‌ సాగుకు అనుమతులు వచ్చాయని, రాష్ట్రంలో ఆయిల్‌‌‌‌ పామ్‌‌‌‌ తోటలు మరింత విస్తరించేలా చర్యలు తీసుకుంటున్నామని మంతి పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌రెడ్డి చెప్పారు. ఆయిల్‌‌‌‌ పామ్‌‌‌‌ టన్ను గెలల ధర రూ.20 వేలు తగ్గకుండా చర్యలు చేపడుతున్నామన్నారు. భూమి ఉన్న ప్రతి రైతుకు ఆయిల్‌‌‌‌పామ్‌‌‌‌ మొక్కలు అందేలా చూస్తామన్నారు.

నాసిరకం మొక్కలు అందజేస్తే కంపెనీలతో పరిహారం కట్టిస్తామని చెప్పారు. డిసెంబర్‌‌‌‌ 9న సోనియా గాంధీ పుట్టినరోజు లోపు రైతులకు రుణమాఫీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌రెడ్డి మాట్లాడుతూ ఆయిల్‌‌‌‌ పామ్‌‌‌‌ ఫ్యాక్టరీ నుంచి వచ్చే వ్యర్థాలతో విద్యుత్‌‌‌‌ను ఉత్పత్తి చేసుకోవడంతో పాటు మిగులు విద్యుత్‌‌‌‌ను గ్రిడ్స్‌‌‌‌కు అమ్ముకునే వెసులుబాటు ఉంటుందన్నారు. ఆయిల్‌‌‌‌ పామ్‌‌‌‌ తోటల్లో అంతర పంటలుగా కోకో, మునగ సాగు చేయవచ్చన్నారు.